సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. బౌన్సర్ల అంశాన్ని ప్రత్యేకంగా సీఎం రేవంత్ ప్రస్తావించారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖులకు చూపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొక్కిసలాట సమయంలో బౌన్సర్ల ఓవరాక్షన్ ను సినీ ప్రముఖులకు అర్థం కావడానికే ఈ వీడియోను ప్లే చేసినట్లు తెలుస్తోంది. ఇకపై బౌన్సర్ల చర్యలకు సెలబ్రెటీలదే బాధ్యతని సీఎం రేవంత్ సినీ ప్రముఖులకు తెలియజేశారు.
బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని సీఎం అన్నారు. బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. బౌన్సర్లు పోలీసులకు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే… తాటతీస్తామని సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో పలు కార్యక్రమాల్లో బౌన్సర్ల హల్ చల్ చేసిన ఘటనలు పోలీసుల దృష్టి వచ్చినట్లు తెలుస్తోంది. క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులు బౌన్సర్లుగా మారి.. ప్రజలను భయపెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సెలబ్రెటీల వద్ద ఉన్న బౌన్సర్లలో కూడా పలువురికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందిన వారు.. ఆ ఏజెన్సీకి ఎలాంటి అనుమతులున్నాయన్న విషయంపై కూడా ఇకపై పోలీసులు ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. సినీతారల వెంట ఉండే బౌన్సర్లు ప్రజలపై చేయి చేసుకోవడం , పోలీసులను తోసేయడం వంటి పనులు చేస్తే కఠినం చర్యలు ఉంటాయని సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ అంశాన్ని ప్రస్తావించడంతో చర్చనీయంశం అయింది.