కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు, ఏప్రన్ మరింత కుంగాయి. గత అక్టోబరులో డ్యామేజీ విషయం బయటపడినపుడు ఏడో బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు, వాటికి కింద ఉండే ఏప్రన్ అడుగున్నర మేర కుంగాయి. తాజాగా నాలుగైదు అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తోంది. ఏడో బ్లాక్ పియర్లు రోజురోజుకూ కుంగిపోతున్నాయని, బ్యారేజీ మరింత ప్రమాదంలోకి వెళుతోందని తాజా పరిణా మాలు సూచిస్తున్నాయి.పియర్లు, బ్యారేజ్ బే ఏరియా, క్రస్ట్ స్పిల్‌వేలోనూ పగుళ్లు మరింత పెరుగు తున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటించి దెబ్బతిన్న భాగాన్ని అధ్యయ నం చేసి వెళ్లిన కొద్ది రోజులకే ఈ మూడు పియర్ల వద్ద ఏప్రన్ మరింత కుంగినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భాల్లో పియర్లు, ఏప్రన్ల వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయి ఉంది. మార్చి 7 నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల పరిశీలన సమయంలోనూ దాదాపుగా అదే తీరుగా కనిపించింది. నెల రోజుల తర్వాత పరిశీలించినపుడు ఎక్కువగా కుంగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఏప్రన్లతో పాటు బ్యారేజీ బే ఏరియాలో ను పగుళ్లు ఏర్పడుతూ ఉండడం గమనించాల్సిన విషయం. దెబ్బతిన్న ఏప్రన్ మరమ్మతులో భాగంగా మొత్తంగా ఏడో బ్లాక్‌ను తొలగించి పునర్నిర్మిస్తే తప్ప బ్యారేజీ నిలబడదని ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే, మరమ్మతుల కోసం నిపుణుల బృందం సూచించిన మేరకు నిర్మాణ సంస్థ బ్యారేజీకి ఎగువ భాగంలో నీటికి అడ్డుగా వేసిన మట్టి కట్ట నుంచి కూడా నీటి ఊటలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా నీరు లీకేజీ జరిగితే దెబ్బతిన్న ఆఫ్రాన్‌కు మరింత నష్టం చేకూరే అవకాశం ఉందని చెబుతున్నారు.


