ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఓవైపు ఇన్వెస్టర్లతో వరుస భేటీలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ కార్యకర్తలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు లోకేష్. అమెరికా పర్యటనలో భాగంగా ఆస్టిన్‌లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా కంపెనీ సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో ఆయన భేటీ అయ్యారు. ఈవీ ప్లాంట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా అనువుగా ఉంటుందని టెస్లా ప్రతినిధులకు వివరించారు లోకేష్. రాష్ట్రంలో ఈవీ చార్జింగ్ నెట్వర్క్, సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీ అమలులో సహకారం కోరారు. అలాగే ఏపీలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు.
మరోవైపు పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని వివరించారు. దీనిపై రాస్ పెరోట్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారిస్తే సహకారం అందిస్తామని తెలపారు.