ఢిల్లీలో ఓ కేఫ్ యజమాని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో శవమై కనిపించడంతో, అది ఆత్మహత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ ప్రముఖ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా మోడల్ టౌన్‌లోని కళ్యాణ్ విహార్ ప్రాంతంలోని తన గదిలో ఉరివేసుకుని చనిపోయాడు.
ఖురానా, అతని భార్య మాణికా జగదీష్ పహ్వా మధ్య విడాకుల వ్యవహారం నడుస్తోంది. ఇద్దరికి త్వరలో విడాకులు మంజూరు కాబోతున్నాయి. దేశ రాజధానిలో వుడ్‌బాక్స్ కేఫ్ యజమానులైన వీరిద్దరి మధ్య వ్యాపార గొడవలు ఉన్నాయి.ఖురానా కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.. అతను భార్యతో మనస్తాపం చెంది ఉన్నాడని అంటున్నారు. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారని అధికారులు తెలిపారు.
వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి 16-నిమిషాల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఖురానా, అతని భార్య వ్యాపార ఆస్తిపై గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. “మనం విడాకులు తీసుకుంటున్నాము, కానీ నేను ఇప్పటికీ వ్యాపార భాగస్వామిని. నా బకాయిలను మీరు క్లియర్ చేయాలి”.. అని ఖురానా భార్య ఫోన్ కాల్‌లో చెప్పింది. పోలీసులు ఖురానా ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖురానా భార్యను విచారణకు పిలిచారు.
గతంలో అతుల్ సుభాష్ ఆత్మహత్య తరహాలోనే..
ఈ కేసు ఇటీవల బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును పోలి ఉంది. డిసెంబరులో 34 ఏళ్ల ఓ ప్రైవేట్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, ఆమె బంధువులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ 24 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు.
“నేను ఎంత ఎక్కువ కష్టపడి ఎదుగుతున్నానో.., నేను అంతకు అంత కుటుంబం నుంచి వేధింపులకు గురవుతున్నాను. మొత్తం న్యాయ వ్యవస్థ నన్ను వేధించేవారిని ప్రోత్సహిస్తుంది. వారికే సహాయం చేస్తుంది … నేను చినిపోయిన తర్వాత, ఎవరూ ఉండరు. డబ్బు, నా వృద్ధ తల్లిదండ్రులు, నా సోదరుడిని వేధించడానికి ఎటువంటి కారణం ఉండదు. నేను నా శరీరాన్ని నాశనం చేసి ఉండవచ్చు, కానీ అది నేను నమ్మిన ప్రతిదాన్ని కాపాడింది”.. అని సూసైడ్ లెటర్‌లో రాశారు.