గోవాలో తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలకు ఏపీ నుంచి 8 మంది స్నేహితుల బృందం గోవా వెళ్లరు. హోటల్‌లో ఫుడ్ విషయంలో టూరిస్ట్‌లు, హోటల్ సిబ్బందికి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రాత్రి ఒంటి గంట తర్వాత అదనపు ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు రెస్టారెంట్ నిర్వాహకులు నిరాకరించడంతో వాగ్వాదం మొదలైనట్టు తెలిసింది. ఇదే విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది
కలంగూటె బీచ్ లోని మెరీనా షాప్ వద్ద మాటా మాటా పెరగడంతో హోటల్ సిబ్బంది రవితేజ అనే యువకుడిపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో రవితేజ తీవ్ర గాయాలతో మృతి చెందినట్టు నార్త్ గోవా ఎస్పీ అక్షిత్ కౌశల్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నేపాల్ కు చెందిన హోటల్ యజమాని, అతని కొడుకుతో పాటు సిబ్బందిని అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే రెస్టారెంట్‌లో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని.. అదే విషయంలో గొడవ జరిగిందని మృతుని బంధువులు అంటున్నారు. ఈ వ్యవహరంపై బాధిత కుటుంబీకులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన గోవా అధికారులతో మాట్లాడారు. రవితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక విమానంలో తాడేపల్లిగూడెంకు పంపించారు అక్కడి అధికారులు.