స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో మండల స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కార్యకర్తలనుద్దేశించి టెలిఫోన్‌లో ప్రసంగం చేపించారు.
ఇప్పటికే 30 వేల కోట్ల రూపాయిలు వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం కేటాయించామని మంత్రి తుమ్మల ఫోన్ ప్రసంగంలో తెలిపారు. ఇవాళ జరగబోయే కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచించారు. హుస్నాబాద్ , కోహెడ , సైదాపూర్ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తానని తెలిపారు.
ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు సూచించారు. సంక్రాంతికి రైతు భరోసా వస్తుందన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు. ఇళ్ల కేటాయింపులో చాలా పారదర్శకంగా ఉంటుందని, ఇందులో ఎవరి జోక్యం ఉండదన్నారు.