పోక్సో కేసు చుట్టూ రాజకీయ విమర్శలు తీవ్రరూపం దాల్చుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని టీపీసీసీ స్పష్టం చేసింది. మైనర్ బాలికపై జరిగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంది.
ఈ కేసులో కులం, రాజకీయాలు, సామాజిక ఒత్తిళ్లకు ఎలాంటి స్థానం లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. చట్టం ముందు అందరూ సమానమేనని… విచారణ పూర్తిగా న్యాయపరమైన విధానంలోనే కొనసాగుతుందని తెలిపింది.
ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలేనని… అవి కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరి కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
పోక్సో చట్టం ప్రకారం మైనర్ ఇచ్చే సమ్మతి చట్టబద్ధం కాదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సంబంధం, రాజీ, పెళ్లి వంటి వాదనలు చట్టపరంగానూ, నైతికంగానూ అంగీకారయోగ్యం కావని స్పష్టం చేశారు.
ఈ కేసును రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. చట్ట ప్రకారం విచారణ కొనసాగుతుందని… ఎవరు ఎంత పెద్దవారైనా న్యాయ ప్రక్రియ తప్పదని తెలిపింది.
మరోవైపు బాధిత చిన్నారి కుటుంబానికి ఎలాంటి బెదిరింపులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.
పోక్సో కేసుల విషయంలో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని… బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.


