హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాజాగా మరో పోక్సో కేసు నమోదవడం కలకలం రేపుతోంది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జితిన్‌పై 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కొత్త కేసు నమోదు చేశారు. తనను లైంగికంగా వేధించడమే కాకుండా… సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు కూడా గుంజాడని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జితిన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ కేసులో నమోదైన కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా, పార్టీ కల్చర్, డబ్బు ప్రలోభాలతో మైనర్లను టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉండే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సోషల్ మీడియా చాట్స్‌ను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. డబ్బుల లావాదేవీలు, ఫోటోలు, వీడియోల ఆధారంగా నిందితుల నెట్‌వర్క్‌ను బయటపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


