తెలంగాణలో సాగు చేసే ప్రతి రైతుకీ రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైతు భరోసాపై మంత్రి వర్గానికి చేయాల్సిన సిఫార్సులపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం భేటీ అయింది. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎంత మేరకు ఇవ్వాలి.. . ఎప్పటి నుంచి రైతు భరోసా ఇవ్వాలి.. అనే విషయాలపై చర్చించింది. పంటలను పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టొద్దని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఈనెల 4న జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయాలు ప్రకటిస్తారు. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తిస్తారు. జనవరి 5వ తేదీ నుంచి 7వరకు దరఖాస్తులు తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉన్నారు. సభ్యులుగా మంత్రులు తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబులు ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి రైతు భరోసాపై చర్చించింది.