చాట్ జీపీటీపై అభ్యంతరాలు చెబుతూ వార్తల్లో నిలిచిన ప్రజావేగు… టెకీ సుచిర్ బాలాజీ హత్యకు గురయ్యాడా…? బాత్‌రూంలో పోరాటానికి సంకేతాలు ఏంటి…? ప్రజావేగు సుచిర్ బాలాజీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత…? ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ బాలాజీ తల్లికి ఎందుకు మద్దతు ఇచ్చారు…? బాలాజీది ఆత్మహత్య కాదా…? సుచిర్‌ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది…? వాస్తవాలు చెప్పడమే సుచిర్ బాలాజీ చేసిన నేరమా…? ఇంతకీ అసలేం జరిగింది…?
ప్రజావేగు సుచిర్ బాలాజీ అమెరికా, శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో నవంబరు 26న విగతజీవిగా కనిపించారు. సుచిర్ బాలాజీ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం యావత్ టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. కాలిఫోర్నియా వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన సుచిర్ బాలాజీ… చదువుతున్న సమయంలోనే ఓపెన్ AIలో ఇంటర్న్‌షిప్ చేశాడు. ఆ తర్వాత ఓపెన్ AI రీసర్చ్ డెవలపర్‌గా నవంబర్ 2020 నుంచి పనిచేయడం ప్రారంభించాడు. చాట్ జీపీటీ వెనుక ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌లకు శిక్షణ ఇవ్వడంలో బాలాజీ సహాయం చేసినట్లు సమాచారం. చాట్ జీపీటీకి ముందున్న టెక్నాలజీ అయిన వెబ్ జీపీడీలో ఓపెన్ AI వ్యవస్థాపకులలో ఒకరైన జాన్ షుల్మాన్‌తో కలిసి బాలాజీ పనిచేశాడు. ఆగస్గు 2024 వరకు రిసెర్చ్‌గా పనిచేసిన బాలాజీ తర్వాత రాజీనామా చేశారు.
ఉద్యోగానికి రాజీనామా చేసిన సందర్భంలో సుచిర్ బాలాజీ చేసిన ఆరోపణలే ఆయన మృతికి కారణం అయ్యాయా…? ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ధి కోసం తాను పనిచేయాలని అనుకోవడం లేదన్నాడు సుచిర్ బాలాజీ. చాట్‌జీపీటీ అభివృద్ధి సమయంలో సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అక్టోబరులో న్యూయార్క్‌టైమ్స్‌తో బాలాజీ మాట్లాడారు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. 2022లో కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక వ్యాజ్యాలు ఓపెన్AIపై దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం అనుమానాలకు తావిస్తోంది.
సుచిర్ మరణంపై సోషల్ మీడియా వేదికగా ఆయన తల్లి అనుమానం వ్యక్తం చేసింది. సుచిర్ అపార్ట్‌మెంట్‌ను ఎవరో దోచుకున్నట్లు కన్పిస్తోందన్న ఆమె… బాత్‌రూమ్‌లో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. రక్తపు మరకలు కన్పించాయని… ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనిపిస్తోందని తెలిపింది. ఈ హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చారని… తమకు న్యాయం జరగాలంటే… ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలని సుచిర్ తల్లి పూర్ణిమ డిమాండ్ చేసింది. ఈ పోస్ట్‌ను ఎలాన్ మస్క్, భారత సంతతి నేత వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ అది ఆత్మహత్యలా అనిపించడం లేదు అని పోస్ట్ చేశారు.
సుచిర్ బాలాజీ మృతిపై ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీంని రెండోసారి శవపరీక్ష నిర్వహించారు. పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఫలితాలు ఉన్నాయని పేర్కొన్నారు. సుచిర్‌తో మాట్లాడిన చివరి వ్యక్తిని తానే అని తండ్రి రామమూర్తి చెప్పారు. సుచిర్ సంతోషంగానే ఉన్నాడని…. ఎలాంటి డిప్రెషన్ లేడని… బర్త్ డే వీక్ కావడంతో మరింత ఆనందంగా ఉన్నాడని చెప్పాడు. జనవరిలో తమను చూడాలని ప్లాన్ చేశాడని… ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. అపార్ట్‌మెంట్‌లో సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఎలాంటి నోట్ రాయలేదంటే ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
సుచిర్ బాలాజీ మృతిపై తల్లిదండ్రుల ఆరోపణలకు ఎలన్ మస్క్ మద్దతు తెలపడంతో వారికి బలం చేకూరినట్లు అయింది. మస్క్ మద్దతు ఉండటంతో… ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత సుచిర్ బాలాజీ మరణంపై మరోసారి ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం లేకపోలేదు. మరో నెల రోజుల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు ఆగాల్సిందే… మరి కొత్త ఏడాదిలోనైనా బాలాజీ పేరెంట్స్‌కి న్యాయం దక్కనుందో లేదో…?