ఖమ్మం జిల్లాలో క్రైమ్ రేట్ ఈ ఏడాది బాగా పెరిగింది. చోరీలు, మోసాలు, ఆర్థిక నేరాలు, సైబర్.. ఇలా ఒకటేమిటి సమస్త నేరాలకు కేరాఫ్‌గా మారింది ఖమ్మం జిల్లా. ఇదేదో ఆషామాషీగా చెబుతోంది కాదు. స్వయంగా పోలీసులు విడుదల చేసిన నివేదికే ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. నూతన సంవత్సరం వేళ.. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో జరిగిన నేరాలు.. ఘోరాలపై స్పెషల్ స్టోరీ.
క్రైమ్స్‌కు కేరాఫ్‌గా నిలిచింది ఖమ్మం జిల్లా. 2023తో పోలిస్తే ఈ ఏడాది నేరాల పెరుగుదల 50 శాతానికి పైగానే ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం చూస్తే.. ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఈ ఏడాది 17 వేలా 56 ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో 16 వేల 961 కంప్లైంట్‌లను పరిష్కరించారు. మొత్తంగా 8 వేల 873 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 2023లో ఇదే కమీషనరేట్ పరిధిలో 13వేల 153 ఫిర్యాదులు రాగా 13వేల 148 కంప్లైంట్‌లను పరిష్కరించారు పోలీసులు. 2023లో మొత్తం 7వేల 667 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఈ ఏడాది మొత్తం 26 హత్యలు జరగగా, కుటుంబ కలహాల నేవథ్యంలో 11, వివాహేతర సంబంధాల కారణాలతో 5 మర్డర్లు జరిగాయి. ఆర్ధిక నేరాలకు సంబంధించి ఈ ఏడాది 727 కేసులు నమోదయ్యాయి. మహిళలకు సంబంధించి 70 లైంగిక దాడి కేసులు, 101 కిడ్నాప్, 17 ఈవ్‌టీజింగ్, 322 వేధింపుల కేసులు రికార్డయ్యాయి.
ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్‌దత్ ఈ విషయంపై వార్షిక క్రైం నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం కమిషనరేట్ పరిధిలో 2023 కంటే 50 శాతం చోరీ కేసులు 2024లో పెరిగాయి. గతేడాది 466 చోరీ కేసులు నమోదుకాగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 700కు పెరిగింది. వీటిలో 295 కేసులను చేధించారు ఖాకీలు. ఈ కేసుల్లో మొత్తం 5.58 కోట్ల రూపాయాలు చోరీ జరగగా… 1.55 కోట్ల రూపాయాలను రికవరీ చేశారు. ఈ ఏడాది 32 చైన్ స్నాచింగ్‌లు నమోదయ్యాయి.
ఆర్ధిక నేరాలకు సంబంధించి గతేడాది 446 కేసులు నమోదుకాగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 727కు చేరింది. వాటిల్లో 397 మోసం కేసులు, 19 ఫోర్జరి ఉన్నాయి. 2023లో 701 ప్రమాదాలు జరగ్గా 213 మంది మరణించారు. 648 మంది గాయపడ్డారు. ఈ ఏడాది 785 ప్రమాదాలు జరగ్గా 271 మంది మరణించారు. 629 మంది గాయపడ్డారు. పోలీసు శాఖ ఈ ఏడాది 3.28 లక్షల చలాన్లు విధించగా 5.8 కోట్ల జరిమానా విధించారు. గతేడాది 6350 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదుకాగా… ఈ ఏడాది 2095 కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాధారణ దొంగతనాల్లో జరిగిన నష్టం కంటే సైబర్ నేరాల ద్వారా ప్రజలు పొగొట్టుకున్నది పదింతలు అధికంగా ఉందని చెప్పుకొచ్చారు పోలీసులు. గతేడాది ఒక వెయ్యి 332 సైబర్ మోసాల కేసులు నమోదవ్వగా ఆయా నేరాల్లో బాధితులు 9 కోట్లు పోగొట్టుకున్నారు. కానీ ఈ ఏడాది 2 వేల 148 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా ఒక వెయ్యి 820 కేసులకు సంబంధించిన విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా నేరాల్లో బాధితులు సుమారు 35 కోట్ల మేర నష్టపోగా… పోలీసులు 2 కోట్ల 42 లక్షలను బ్యాంకుల ద్వారా హోల్డ్‌లో ఉంచగలిగారు. మరో 52 లక్షలను రికవరీ చేశారు. గడిచిన రెండేళ్లలో సాధారణ దొంగతనాల్లో ప్రజలు నష్టపోయిన సొమ్ము 10కోట్లు ఉండగా.. సైబర్ నేరగాళ్లు ఈ ఒక్క ఏడాదిలోనే కొట్టేసిన సొమ్ము సుమారు 35 కోట్లు కావడం భయాందోళనలకు గురి చేస్తోంది.
పోలీసులు నమోదు చేసిన కేసుల్లో కోర్టుల ద్వారా ఈ ఏడాది 4 వేల 398 కేసులకుగాను 2002 కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడ్డాయి. లోక్ అదాలత్ ద్వారా 18 వేల 224 కేసులు పరిష్కరించారు. ఈ సంవత్సరం జిల్లాలో ఇద్దరికి ఐదేళ్ల శిక్ష, ఒకరికి పదేళ్లు, నలుగురికి 20ఏళ్ల శిక్ష పడగా.. ఇద్దరికి జీవిత ఖైదు పడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసుల విషయానికొస్తే గతేడాది 605 కేసులు నమోదుకాగా ఈ ఏడాది 702 కేసులు రికార్డయ్యాయి. గత ఏడాది డయల్ 100కు 40 వేల 519 కాల్స్ రాగా ఈ ఏడాది 48 వేల 8 కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు పోలీసు ఉన్నతాధికారులు.