యెమెన్‌లో మరణశిక్ష పడిన నిమిష ప్రియ స్వగ్రామం కేరళలోని పాలక్కాడు. ఆమె నర్సుగా శిక్షణ తీసుకున్నారు. యెమెన్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్నేళ్లు పని చేశారు. ఆర్థిక కారణాల వల్ల ఆమె భర్త , మైనర్ కుమార్తె 2014లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అదే సంవత్సరం, యెమెన్ అంతర్యుద్ధంతో చిక్కుకుంది. దేశం కొత్త వీసాల జారీని నిలిపివేసినందున వారు తిరిగి వెళ్ళలేకపోయారు.
తర్వాత 2015లో, ప్రియా సనాలో తన క్లినిక్‌ని స్థాపించడానికి తలాల్ అబ్దో మహదీ మద్దతును కోరింది. యెమెన్ చట్టం ప్రకారం, జాతీయులు మాత్రమే క్లినిక్‌లు , వ్యాపార సంస్థలను స్థాపించే వీలుంటుంది.
2015లో యెమనీ సుప్రీం కోర్టులో ఆమె చేసిన అప్పీలు ప్రకారం… మహది .. ప్రియాతో కలిసి నెల రోజుల సెలవు కోసం కేరళకు వచ్చారు. ఈ సమయంలో నిమిషా ప్రియ పెళ్లి ఫోటోను అతను దొంగిలించాడు. తరువాత ఆ ఫోటోలో తన ఫోటోను మార్ఫింగ్ చేసి ప్రియను పెళ్లి చేసుకున్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేశాడు.
వారు తిరిగి యెమన్ వెళ్లిన తర్వాత, ప్రియ క్లినిక్ ప్రారంభించింది. మహది మొత్తం ఆదాయాన్ని తీసుకోవడం ప్రారంభించాడు. క్లినిక్ యాజమాన్య పత్రాలను కూడా తారుమారు చేశాడు. ఈ విషయం తెలిసుకున్న నిమిషా ప్రియా మహదీని నిలదీసింది. దీంతో అతను ఆమె పట్ల విద్వేషం పెంచుకున్నాడు.
ప్రియా.. తన భార్య అని అందరికీ చెప్పి, పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలను చూపించి.. ఆమె నెలవారీ సంపాదనలో డబ్బు తీసుకోవడం ప్రారంభించాడు. మహదీ వేధింపులు శారీరక హింసగా మారాయని, మహదీ తన పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడని ప్రియా తన పిటిషన్‌లో పేర్కొంది.
ఆమె కోర్టులో పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రియా ఈ విషయంపై సనాలోని పోలీసులను కూడా సంప్రదించింది, అయితే మహదీపై చర్య తీసుకోవడానికి బదులుగా, పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆరు రోజుల పాటు జైలులో ఉంచారు. మహదీ గురించిన విషయాలు మెల్లగా బయటకు వచ్చాయి. అతను పాత నేరస్థుడని.. వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్టు తేలింది. జూలై 2017లో, తన క్లినిక్ కి సమీపంలోనే ఉన్న .. మహదీ జైలు శిక్ష అనుభవించిన జైలుకు వెళ్లి అక్కడి వార్డెన్‌ను ప్రియ కలిసింది.
మహదీకి మత్తు ఇచ్చి అతను మత్తులో జారుకున్న తర్వాత పాస్ పోర్టు ఇచ్చేలా ఒప్పించాలని జైలు వార్డెన్ ప్రియకు సూచించారు. దీన్ని అమలు చేయాలనుకుంది ప్రియ. అయితే మహదీకి మత్తు మందు తీసుకోవడం అలవాటు ఉండడంతో ప్రియ ఇచ్చిన మత్తు ఎక్కలేదు. మళ్లీ మత్తు ఎక్కించడానికి ప్రియ ప్రయత్నించింది. పాస్ పోర్టు తీసుకోవాలనే ప్రయత్నంలో స్ట్రాంగ్ డోస్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే మత్తు ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఓవర్ డోస్ కారణంగా మహది మరణించాడు.