ఏపీ రాజకీయాల్లో రేషన్ బియ్యం కేసు రాజకీయ దుమారం రేపుతోంది. కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిని పోలీసులు ఏ6గా చేర్చారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే క్రమంలో ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. హైకోర్టులో జరిగిన వాదనలు ఏంటి..? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎవరెవరిని అరెస్ట్ చేశారు.?
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దని..కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో నాని ఏ6గా ఉన్నారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. ఏ2గా గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు చేర్చారు. 2016 నుంచి మాజీ మంత్రి నాని దగ్గర పనిచేస్తున్నారు. ఇక పెడనకి చెందిన లారీ డ్రైవర్ మంగారావు ఉషోదయ ట్రాన్స్ పోర్ట్‌లో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గోడౌన్ నుంచి MLS పాయింట్స్‌కి మంగారావు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఇదే కేసులో పేర్ని నాని భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలోనే విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పోట్లపాలెం సమీపంలో పేర్ని నాని, తన సతీమణి జయసుధ పేరుతో బఫర్ గోడౌన్ నిర్మించారు. అందులో దాదాపు 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా జయసుధ ఉండగా, పేర్ని నానిని ఏ-6గా చేర్చారు. ఏక్షణమైనా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇకపోతే జయసుధ గోడౌన్‌కు సంబంధించి, 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఏ-1 నిందితురాలు పేర్ని జయసుధ ముందస్తు బెయిల్‌పై ఉండగా, సోమవారం మరో నలుగురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించి కృష్ణా జిల్లా కోర్టుకు తరలించారు. రిమాండ్‌కు తరలించిన నిందితుల్లో సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, గోడౌన్ మేనేజర్ మానస తేజ, డీలర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులు సైతం ఉన్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్‌లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు చెకింగ్ చేశారు. ఆ తనిఖీల్లో గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు, అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు చాలా తేడాలు గమనించారు. ఈ క్రమంలో గోడౌన్ యజమాని అయిన జయసుధను వివరణ కోరారు. వే బ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదంటూ తొలుత నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేసింది. నోటీసుల నేపథ్యంలో 1.79 కోట్ల రూపాయల డీడీని ప్రభుత్వానికి జయసుధ చెల్లించారు. ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు సైతం దర్యాప్తు చేపట్టారు. గోడౌన్‌లో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయినట్లు గుర్తించారు. మరో 1.67 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో విధంగా రేషన్ బియ్యం కేసు వ్యవహారం మలుపు తిరుగుతోంది. మరి రానున్న రోజుల్లో ఈ కేసు మరెన్ని పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.