ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నేటితో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో గంట సేపు ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులను స్వీకరిస్తూ వస్తున్నారు.
ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివస్తున్నారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోని ప్రజలు కూడా ప్రజాదర్బార్‌కు వచ్చి లోకేష్‌కు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అయితే వెంటనే అధికారులకు వాటిని అందించి సమస్యలకు పరిష్కారం దొరికేలా నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటివరకు 75శాతం సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5వేల 810 విజ్ఞప్తులు అందగా 4వేల 400 అర్జీలను పరిష్కరించారు. 1,410 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్యల్లో దాదాపు 50 శాతం వరకు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవి. భూవివాదాలకు సంబంధించి 1,585 విజ్ఞప్తులు అందగా 1,170 సమస్యలను పరిష్కరించారు. 415 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.
హోంశాఖకు సంబంధించి 1,276 విజ్ఞప్తులు రాగా 1,158 విజ్ఞప్తులను పరిష్కరించారు. 118 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందగా అర్హతలను బట్టి 347 మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పెన్షన్ కోసం 350 దరఖాస్తులు అందాయి. ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపనున్నారు.