స్వతంత్ర, వెబ్ డెస్క్: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివు హెచ్చరించారు. ఆయన నోరు యాసిడ్‌తో కడగడం కాదని, నిప్పులు పోసికడిగినా బాగుపడదని మండిపడ్డారు. బిజెపి లాంటి పార్టీలు సమాజానికి పట్టిన చీడ అయితే దానికి పట్టిన పీడ బండి సంజయ్ అని, అడ్డుఅదుపులేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయ సంస్కారం లేకుండా సంజయ్ వ్యాఖ్యలు వున్నాయని, ఖమ్మం జిల్లాకు రాగానే పూనకం వచ్చినట్లు మాట్లాడటం తగదని హెచ్చరించారు. కమ్యూనిస్టు పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ఏనాడూ తహతహలాడదని, సీట్లకు కోసం బిజెపి లాగా అడ్డమైన పనులకు పాల్పడమని అన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి ఖమ్మం జిల్లా ప్రజలు బిజెపిని అధికారమేమోగాని, కనీస స్థానాలను కూడా గెలవనివ్వరని అన్నారు.