ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూపాయి మారకం విలువ పడిపోకుండా బంగారం దిగుమతి తగ్గించడంపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా దేశంలో ఇళ్లలో ఇంకా పలు చోట్ల నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు గోల్డ్ రీసైక్లింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తోంది. దేశంలో 32 వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. నిల్వ ఉన్న బంగారం విలువ సుమారు 3.8 ట్రిలియన్ డాలర్లకు పైమాటే. ఇళ్లలో, లాకర్లలో, దేవాలయాల్లో బంగారం మూలుగుతోంది.
నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా మార్చి వినియోగంలోకి తేవాలని కేంద్రం పిలుపునిస్తోంది. ఇందుకు గోల్డ్ రీసైక్లింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తోంది. పాత బంగారాన్ని స్వచ్ఛ బంగారంగా మార్చే ప్రక్రియనే గోల్డ్ రీసైక్లింగ్ అంటారు. పాత బంగారాన్ని శుద్ధి చేసి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా మార్చి..తిరిగి మార్కెట్‌లోకి తీసుకురావడమే గోల్డ్ రీసైక్లింగ్ లక్ష్యం. ఇలా బంగారాన్ని శుద్ధి చేసిన అనంతరం కొత్త నగలు, నాణేలు, బులియన్ ఉత్పత్తుల తయారీలో వినియోగించవచ్చు. దేశంలో ఉన్న మొత్తం బంగారంలో కేవలం 1 శాతం గోల్డ్ ప్రతి సంవత్సరం రీసైక్లింగ్‌కు వస్తే.. బంగారం దిగుమతులు 25 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


