తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్, మరో చోట బీజేపీ మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందారు. ఈ రెండో చోట్లా సిటింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
ఉమ్మడి కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమరయ్య పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై 5 వేల 777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 15 మంది అభ్యర్థులు ఈ స్థానంలో పోటీపడగా తొలి ప్రాధాన్య ఓట్లతోనే కొమరయ్య విజయాన్ని అందుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన కూర రఘోత్తంరెడ్డి కేవలం 428 ఓట్లు మాత్రమే సాధించారు. మొత్తంగా ఈ స్థానంలో 25 వేల 41 ఓట్లు పోలవగా 24 వేల144 చెల్లుబాటయ్యాయి. పోలైన ఓట్లలో 50 శాతానికి మించి ఓట్లు రావాల్సి ఉంది. కొమరయ్యకు 12 వేల 959 ఓట్లు వచ్చాయి. దాంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గెలుపొందిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
మరోవైపు ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 10 గంటల తర్వాతే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంకా చెల్లిన, చెల్లని ఓట్లను వేరుచేస్తున్నారు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనుండడంతో కౌంటింగ్ ఆలస్యం కానుంది.
ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో భారీగా ఓట్లు చెల్లుబాటు కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగగా.. నిన్న కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్ జరిగింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయగా, కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మాత్రమే పోటీ చేసింది.