TDP కేంద్ర కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్, దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వైకాపా నేత వల్లభనేని వంశీ ఫోన్‌పై పోలీసులు దృష్టి సారించారు. దీనిని స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో ఆయన సెల్‌ఫోన్ దొరకలేదు. వ్యక్తిగత సహాయకుడి ఫోన్‌ను గురువారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తాజాగా.. వంశీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ తమ చేతికి వస్తే గుట్టు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చిన తర్వాత హైదరాబాద్, విజయవాడలోని వంశీ ఇళ్లల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. పోలీసుల దృష్టి నుంచి తప్పించుకునేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సప్‌లో మాట్లాడుతుంటారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఫోన్‌కు సంబంధించి ఐపీడీఆర్ వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఆయన ఎవరెవరితో టచ్‌లో ఉన్నారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వంశీని నిన్న తెల్లవారుజామున విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. జైలులో మిగిలిన వారితో కలపకుండా సింగిల్ సెల్‌లో ఉంచారు. నిన్న మధ్యాహ్నం ఆయన భార్య పంకజశ్రీ.. ములాఖత్‌లో కలిశారు.