అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. తుది తీర్పులో బతుకమ్మ కుంటగానే గుర్తించింది ఉన్నత న్యాయస్థానం. బతుకమ్మ కుంట స్థలం తమదంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద గత 3 దశాబ్దాలుగా తనదిగా చెబుతున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమమేనంటూ హైకోర్టు తీర్పు చెప్పింది.
అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హైడ్రాను సంప్రదించడమే కాకుండా..సంబంధిత పత్రాలను కూడా అందజేశారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా నవంబరు 13వ తేదీన అబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించిన హైడ్రా కమిషనర్.. ఏవీ రంగనాథ్.. అదే రోజు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు ప్రారంభించింది. హైడ్రా చర్యలపై ఎడ్ల సుధాకర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు స్టే ఇచ్చింది.
ఆ తర్వాత హైడ్రా , రెవెన్యూ, ఇరిగేషన్, సంబంధిత శాఖ అధికారులు సర్వే నంబరు 563 లో ఉన్న భూ రికార్డులను పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలుచేయగా… ఇరువైపుల వాదనలు విన్న గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కరరెడ్డి పిటిషనర్ అయిన ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఈ భూమిపై ఎలాంటి హక్కులేదని తీర్పుచెప్పారు. అది బతుకమ్మ కుంటగానే నిర్ధారించారు. బతుకమ్మకుంటపైన 2017 సంవత్సరంలో హైకోర్టు డబుల్ బెంచ్ చెరువుగానే తీర్పును వెలువడించినది. ఫిర్యాదుదారుడికి ఏమైనా హక్కుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టు తీర్పు పట్ల హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు.