స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపూర్‌లో(Manipur) మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ఘాటుగా స్పందించారు. డీఎంకే ఎంపీలు చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చే క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి లోక్‌సభలో ప్రసంగించారు. ఈ క్రమంలోనే భారతదేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై డీఎంకే నాయకురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ‘‘మణిపూర్, రాజస్థాన్ లేదా ఢిల్లీలో ఎక్కడైనా మహిళలు బాధపడుతున్నారు.. దానిని మనం సీరియస్‌గా తీసుకోవాలి.. అయితే ఇందులో రాజకీయాలు ఉండకూడదు’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.
అదే సమయంలో 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీరను లాగిన సంఘటనను ప్రస్తావించారు. ‘‘ఆమె(జయలలిత) అప్పటికీ సీఎం కాలేదు.. ప్రతిపక్ష నాయకురాలు. తమిళాడు అసెంబ్లీలో జయలలిత చీర లాగి… డీఎంకే నవ్వుతూ, ఎగతాళి చేసింది. దీంతో ముఖ్యమంత్రి అయిన తర్వాతే తాను తిరిగి అసెంబ్లీకి వస్తానని జయలలిత ప్రమాణం చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాతే సభకు వచ్చారు’’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
అయితే సభలో నిరసన వ్యక్తం చేస్తున్న డీఎంకే సభ్యులను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘మీరు కౌరవ సభ గురించి మాట్లాడుతున్నారు, ద్రౌపది గురించి మాట్లాడుతున్నారు, డీఎంకే జయలలితను మరిచిపోయిందా? నమ్మశక్యంగా లేదు.. మీరు ఆమెను అవమానించారు’’ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.