పార్టీ బలోపేతంతోపాటు కూటమి ప్రభుత్వంపై ప్రజా పోరాటం విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించనుంది వైసీపీ. పార్టీ అధినేత వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలో జరగనున్న సమావేశంలో పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గోనున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో వైసీపీ నిర్మాణంపై చర్చించనున్నారు. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చ జరగనుంది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించడంతోపాటు పార్టీ తరఫున నిర్వహించాల్సిన ప్రజా పోరాటాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారాన్ని కూటమి ప్రభుత్వం మోపిందని ఆరోపిస్తోంది వైసీపీ. ధాన్యం సేకరణ అంశంతోపాటు రైతులను దళారులు దోచుకుంటున్న విధానంపైనా చర్చించనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించనున్నారు వైసీపీ అధినేత. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే విషయంలో చేపట్టనున్న కార్యాచరణపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న మాట విన్పిస్తోంది.