స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర భీమవరంలో జనసంద్రంగా మారింది. భీమవరం పట్టణంలో అడుగడుగునా లోకేశ్ కు అపూర్వస్వాగతం లభించింది. 205వ రోజు యువగళం పాదయాత్ర భీమవరం శివారు శ్రీరామ ఆటోమొబైల్స్ నుంచి ప్రారంభం కాగా… ప్రకాశం చౌక్, పొట్టిశ్రీరాములు విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం, సోమేశ్వరస్వామి ఆలయం, తాడేరు బ్రిడ్జి, ఇందిరమ్మ కాలనీ, తాడేరు మెయిన్ రోడ్డు, తాడేరు అంబేద్కర్ బొమ్మ మీదుగా బేతపూడి వరకు పాదయాత్ర సాగింది. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు.
జగన్ హాలిడే సీఎం. జనం కష్టాల్లో ఉంటే రూ.12 కోట్లు పెట్టి లండన్ హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. అటువంటాయన పేదలకి పెత్తందార్లకి యుద్ధం అని ఫోజులు కొడుతున్నాడు. జగన్ సీఎం అయిన రోజు నుండి రాష్ట్రంలో ప్రజలందరికి హాలిడే ఇచ్చాడు. ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికులకు హాలిడే ఇచ్చాడు. పరిశ్రమలు తరిమేసి యువతకు హాలిడే ఇచ్చాడు. ఆక్వా రంగాన్ని నాశనం చేసి ఆక్వా హాలిడే ఇచ్చాడు. రైతుల్ని ముంచి క్రాప్ హాలిడే ఇచ్చాడు. ఇప్పుడు పరిశ్రమలకు కరెంట్ కోతలు పెట్టి పవర్ హాలిడే ఇచ్చాడు. పరిశ్రమలకు 12 గంటలు పవర్ హాలిడే అంట. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకే యంత్రాలు తిప్పాలంట. టైం దాటి ఇండస్ట్రీ నడిస్తే కేసులు పెట్టి ఫైన్లు వేస్తారట.
జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు, పవర్ హాలిడే దెబ్బకి ఉన్న పరిశ్రమలు కూడా బైబై ఏపీ అనడం ఖాయం. ఉభయగోదావరి జిల్లాలు దాటేలోపు మిషన్ గోదావరి ప్రకటిస్తా. రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలు ఎలా అభివృద్ధి చేస్తామో మిషన్ గోదావరిలో వివరిస్తానని నారా లోకేష్ అన్నారు.