ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాజీ సీఎం జగన్ చేసిందేమీ లేదన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో గాడి తప్పిన పాలనను సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. ఈ విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు మంత్రి లోకేష్.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామని అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 8న విశాఖలో పర్యటించనుండడంతో ఆయన టూర్ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఎక్కడా ఎలాంటి పొరబాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
ఈ సందర్భంగా పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్రకు… మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిందేమీ లేదన్నారు. ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదంటూ ఎద్దేవా చేశారాయన. కియా పరిశ్రమను తీసుకొచ్చింది చంద్రబాబేనని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో పలు పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని ఆరోపించారు నారా లోకేష్.
గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన పాలనను ప్రస్తుతం సరిచేస్తున్నామన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. పరిస్థితిని మెరుగు పరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవైటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని చెప్పుకొచ్చారు మంత్రి. ఈ విషయంలో ఎవరూ సందేహపడొద్దని.. వైసీపీ దృష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు లోకేష్.
రుషికొండ నిర్మాణాల విషయంలోనూ సీరియస్ కామెంట్స్ చేశారు నారా లోకేష్. ఒక మనిషి బతికేందుకు 700 కోట్లు ఖర్చు చేసి రుషికొండ భవనాలు నిర్మించారని అన్నారు. ఐదేళ్ల పరిపాలనలో ఈ ప్రాంతానికి జగన్ సర్కారు ఇది మినహా చేసిందేమీ లేదన్నారు లోకేష్.
విశాఖ మోదీ టూర్‌పై సమీక్ష
ఇక, ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన షెడ్యూలు పరిశీలిస్తే.. ఈనెల 8న మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటలకు రోడ్‌షోకు వెళతారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ముగ్గురూ కలిసి పాల్గొనే రోడ్‌షో సిరిపురం నుంచి మొదలై ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వరకు సాగనుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ.
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.