ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందా? అందుకే తగినట్లుగా పావులు కదుపుతున్నారా? ఇందుకు అసెంబ్లీ రూల్స్ ఏం చెబుతున్నాయి? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ చర్చే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చిన వైఎస్ జగన్.. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసలు సభకే రావడం లేదు. తాను రాకపోవడమే కాకుండా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సభకు హాజరు కావొద్దంటూ ఆదేశించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది.
వైసీపీ హాయంలో బాధితుడిగా ఉన్న రఘురామ కృష్ణంరాజు ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్‌గా నియమించబడ్డారో.. అప్పటి నుంచిజగన్ సభలోకే అడుగు పెట్టలేదు. మొదట్లో జగన్ సభకు రావాలంటూ వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసిన రఘురామ.. జగన్ నుంచి స్పందన లేకపోవడంతో ఏకంగా అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. అయితే ఒక ఎమ్మెల్యేపై గైర్హాజరు కారణం చూపి అనర్హత వేటు వెయ్యొచ్చా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో కూడా మాజీ సీఎం కేసీఆర్ ఒక్క సారి తప్ప.. అసలు అసెంబ్లీ మొఖం చూడటం లేదు. అక్కడి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ విషయంలో అనర్హత వేటు అని ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. కానీ ఏపీలో మాత్రం జగన్ విషయంలో అనర్హత అనే మాట పదే పదే వినిపిస్తోంది.
అసెంబ్లీకి హాజరు కావడం సభ్యుల బాధ్యత అని.. ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయనపై అనర్హత వేటు వేస్తామంటూ జగన్ ను ఉద్దేశించి రఘురామ చేసిన హెచ్చరిక చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రాజ్యాంగంలో పలు నిబంధనలు ఉన్నాయి. అయితే ఇందులో అసెంబ్లీకి వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చా లేదా అనే దానిపై నిబందనలు ఎలా ఉన్నాయని పలువురు ఆరా తీస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం.. ఒక ఎమ్మెల్యేను అనర్హుడిని చేయాలంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన హోదాల్లో ఉంటే చేయొచ్చు. అలాగే ఎమ్మెల్యే మానసిక స్దితి సరిగా లేది కోర్టు ప్రకటిస్తే ఇలా అనర్హుడిని చేయొచ్చు. ఎమ్మెల్యే ఏదైనా అప్పు తీసుకుని చెల్లించలేక దివాళా తీస్తే కూడా చేయొచ్చు. అలాగే భారత దేశ పౌరుడై ఉండి ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే అనర్హత వేటు వేయవచ్చు. ఇలా ఆర్టికల్ 191లోని షరతుల వల్ల ఎవరినైనా అనర్హులుగా ప్రకటించవలసి వస్తే ఈ నిర్ణయం అంతిమంగా రాష్ట్ర గవర్నర్ తీసుకోవాలి. ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.
ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం కూడా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఎమ్మెల్యే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా.. ఎమ్మెల్యే తమ రాజకీయ పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా ఓటు వేయకుండా దూరంగా ఉంటే కూడా అనర్హత వేటు వేయవచ్చు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరవచ్చు. కానీ పార్టీలోని మూడింట ఒక వంతు మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని వదులుకుంటే ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు వర్తించవు. బదులుగా దీన్ని పార్టీ లెజిస్లేటీవ్ పార్టీలో విభజనగా పరిగణిస్తారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హట వేటు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరి ఇన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతున్నప్పుడు.. గైర్హాజరీ విషయంలో అనర్హత పడుతుందా అంటే రాజ్యాంగ నిపుణులు అవుననే అంటున్నారు.
పార్లమెంట్‌కు సంబంధించి ఎవరైనా ఎంపీ.. స్పీకర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే మాత్రం అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. దీంతో గతంలో ఎంపీగా పని చేసిన రఘురామ.. ఈ నియమాన్ని అసెంబ్లీకి వర్తింప చేసి చెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకు 60 రోజుల నిబంధన వర్తించదని.. ఆ కారణంతో అనర్హత వేటు వేయలేరని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు మాత్రం స్పీకర్ నిర్ణయం అంతిమంగా ఉంటుందని చెప్తున్నారు.
జగన్‌పై అనర్హత వేటు కత్తి వేలాడుతున్న పరిస్థితుల్లో ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ శీతాకాల సమావేశాలకైనా హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.