ధాన్యం కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే.. తానే స్వయంగా అక్కడికి వెళ్తానని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసే విధానాలు తెచ్చామని చెప్పారు. నిధులు అందుబాటులో ఉంచామని… అయినా అధికారులు, ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎందుకు సహించాలని ఆయన మండిపడ్డారు. తేమ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వపరంగా ఏం చేయాలో ఆలోచించాలన్నారు. బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది మాఫియాలా తయారైందని, దీనిపై యంత్రాంగం ప్రణాళికతో పనిచేయాలని.. విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో చంద్రబాబు నిన్న సమీక్షించారు. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని అధికారులకు చెప్పారు. సమస్యలు రాకుండా సేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులు, రైస్‌మిల్లర్ల నుంచి సహాయ నిరాకరణ కారణంగా రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాల వారీ ధాన్యం కొనుగోలు వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.