మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఎంత చెప్పినా వినకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మందుబాబులు. అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా పట్టించుకోవడం లేదు. ఒక్కసారి కుటుంబాన్ని, పిల్లలను గుర్తు చేసుకోండి.. వాళ్లు అనాథలైపోతారని.. పదే పదే మొత్తుకున్నా వినేదే లే అంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా మద్యం సేవించడం.. అతివేగంగా వాహనాలు నడపడం.. యాక్సిడెంట్ చేయడం.. ప్రాణాలు కోల్పోవడం.. ఫ్యామిలీని అనాథలుగా మార్చడం.. ఇలా ఎన్ని రోజులు.. ఒక్క క్షణం ఆలోచిస్తే తమ కుటుంబాన్ని బాధల నుంచి విముక్తులను చేసినవారవుతారు. కుటుంబ పెద్దను పోగొట్టుకునే బాధ వారికి తప్పుతుంది.. కదా..!
మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ఓ వ్యక్తి ఆర్తనాదాలు అక్కడి వారిని కలిచివేసింది. నాకు పిల్లలు ఉన్నారు.. కాపాడండి ప్లీజ్.. అని వేడుకున్న అతని మాటలే స్థానికులకు పదే పదే వినిపించాయి. ఎలాగైనా అతనిని కాపాడాలని వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.
కీసర పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి దాయర గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి అతివేగంగా వచ్చిన షిఫ్ట్ కారు చెట్టును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వేల్పుల మహేష్ తన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్క నిమిషం గడిస్తే ఇంటికి చేరుకునేవాడు. కానీ ఇంతలోనే యాక్సిడెంట్ రూపంలో మృత్యువు వెంటాడింది.
ఆదివారం తన భార్య పిల్లలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లాడు. అయిపోయాక తిరిగి ఇంటికి వచ్చిన మహేష్ కుటుంబం… తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్తానని తన భార్యకు చెప్పి బయటకు వెళ్ళాడు.
తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. తిరిగి కారులో ఇంటికి వస్తున్న సమయంలో తన నివాసానికి 200 మీటర్ల దూరంలో చెట్టును ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే చూసిన గ్రామస్తులు హుటాహుటిన కాపాడే ప్రయత్నం చేశారు. కానీ కారు నుజ్జునుజ్జైంది.
చెట్టుని బలంగా ఢీకొట్టిన షిఫ్ట్ కారులో వేల్పుల మహేష్ ఒక్కడే ఉన్నాడు. తనని కాపాడమంటూ అక్కడికి వచ్చిన స్థానికులను ప్రాధేయపడడం అందర్నీ కంటతడిపెట్టించింది. తనకు పిల్లలు ఉన్నారని కాపాడమంటూ వేడుకున్నప్పటికీ కారు నుండి బయటకు తీసేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టిందని స్థానికులు తెలిపారు.