మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఒక పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన భారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది భీకర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రమాదానికి గురైన ట్రక్కులో దాదాపు 100 మందికి పైగా పెళ్లి బృందం సభ్యులు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముంబై-అహ్మదాబాద్ హైవేపై ప్రయాణిస్తుండగా ఓ మూలమలుపు వద్ద ప్రమాదం జరిగింది. కంటైనర్ ఢీకొట్టిన వేగానికి ట్రక్కు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. గాయపడిన 28 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని కాసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


