గోదావరి, కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 1 నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాగు నీటిపై అధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సమీక్షించారు. జూన్ 1 నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ఖరీఫ్‌కు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే కాలువల్లో పూడికతీత పనులు మే చివరి వారం వరకూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు జులై చివరి వరకు, కేసీ కెనాల్‌కు జులై 15 నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే వంశధార ఆయకట్టుకు జూన్ 15 నుంచి సాగు నీరు విడుదల చేయనున్నట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఖరీఫ్ ప్రణాళికలు, ఎల్‌నినో ప్రభావంపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. యూరియా సరఫరా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు అందజేస్తామని, అవసరం మేరకు ఆ కార్డు ద్వారా యూరియా తీసుకోవచ్చని తెలిపారు. ముందస్తు నిల్వలు వద్దని, రెండు-మూడు దశల్లో నానో యూరియా వినియోగించాలని సూచించారు. యుద్ధం కారణంగా యూరియా దిగుమతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందువల్ల యూరియాను అవసరం మేరకు మాత్రమే వాడాలని రైతులకు అచ్చెన్నాయుడు సూచించారు.


