‘రేవంత్ రెడ్డి నెక్ట్స్‌ సువెందు అధికారి అవుతాడు’- బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి ‘సువేందు అధికారి’ తరహాలో రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఉదాహరణను ప్రస్తావిస్తూ అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద తప్పు చేసిందని అర్వింద్ విమర్శించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో పనిచేసిన సీనియర్ నేతలను పక్కనబెట్టి రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వడం పార్టీకే నష్టం చేస్తుందని అన్నారు.

ఇక సువేందు అధికారి ఉదాహరణను ప్రస్తావిస్తూ, తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత ఆయన మమతా బెనర్జీకి బలమైన రాజకీయ ప్రత్యర్థిగా మారారని గుర్తుచేశారు. అలాంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కూడా చోటుచేసుకునే అవకాశాలున్నాయని అర్వింద్ సంకేతాలు ఇచ్చారు.

తదుపరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ పరాజయం తప్పదని కూడా ఆయన జోస్యం చెప్పారు. “1985, 1994లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. అలాగే 2028-29లో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిని ఎదుర్కొంటుంది” అని ధర్మపురి అర్వింద్ అన్నారు.

ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం రావడానికి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. సభ వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్న సమయంలో ప్రధాని మాట్లాడుతూ, “ఆప్ జహాన్ పహుంచ్నా చాహ్తే హైం… నహీ పహుంచ్ పాయేంగే… అచ్చా హై కి మేరే సే హీ జుడో” అంటూ వ్యాఖ్యానించారు. అంటే “మీరు చేరాలనుకునే స్థాయికి చేరుకోలేకపోవచ్చు… నాతో కలిస్తే మంచిది” అనే అర్థంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఆ వ్యాఖ్యలపై స్పందించిన అర్వింద్‌, “దానికి అసలు అర్థం ఏమిటో నాకు తెలియదు. నేను బీజేపీలో సాధారణ కార్యకర్తను మాత్రమే. కానీ ఏదో రాజకీయ పరిణామం జరుగుతున్నట్టు అనిపిస్తోంది. సువేందు అధికారి చేసినట్టే ఏదైనా జరుగుతుందేమో తెలియదు” అని అన్నారు.

అలాగే రాబోయే రెండేళ్లలో తెలంగాణలో హైడెసిబెల్ రాజకీయాలు జరుగుతాయని, చివరికి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు ముదురుతున్న నేపథ్యంలో అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్