పేదరికంలో పుట్టారు. పెద్ద పెద్ద స్కూల్స్‌లో చదువుకునే స్థోమత వారికి లేదు. కుటుంబ పోషణ కోసం చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబానికి సాయంగా ఉంటున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ఎలాగైనా తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలనే తాపత్రయంతో వారిని ప్రభుత్వం నడుపుతున్న ఎస్సీ , ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చేర్పించి చదివిస్తున్నారు. అయితే హాస్టల్‌లో విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాల్సిన వార్డెన్ వారితో వెట్టి చాకిరీ చేయిస్తూ బాల్యాన్ని హరిస్తున్నారు. అభం, శుభం తెలియని చిన్నారులు ఆటలపాటలతో చదువుకుంటూ కాలం గడిపేవారు. ఎలాంటి భారాలు లేకుండా గడిచిపోయే బాల్యం వారిది.
అటు వంటి చిన్నారులతో హాస్టల్ అధికారులు మోయలేని భారాలు మోపిస్తున్నారు. చిన్నపిల్లలు అని చూడకుండా అనంతపురం సాయి నగర్ మూడవ క్రాస్ లో ఉన్న ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహం వన్ లో విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. వార్డెన్.. వారిని వంట మనుషులు, పని మనుషులుగా మార్చేశారు. వంట వండటానికి పెద్ద పాత్రలో బియ్యం కడిగి వాటిని ఎత్తుకొని వంట గదిలోకి వెళ్తున్న విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో చేయరాని, చేయకూడని ఎన్నో పనులను విద్యార్థుల చేత చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు స్వతంత్ర టీవీ చేతికి చిక్కాయి.
ఈ మధ్య కాలంలో వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులతో కిచెన్ క్లీనింగ్, పూరీ తయారీతో పాటు, వివిధ పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గదులను శుభ్రం చేయడం, గిన్నెలు కడిగించడం లాంటి పనులన్నీ కూడా విద్యార్థుల చేత చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం, అత్యంత ప్రమాదకరంగా వేడి వేడి గిన్నెలను సైతం విద్యార్థుల చేత దించేలా చాకిరీ పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు విచారణ జరిపి హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.