దేశ రక్షణలో దశాబ్దాలుగా హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక రక్షణ శాఖ విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా DRDO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.. ఇందులో శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి.. త్రివిధ దళాలపై యువతకు అవగాహన కోసం 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..సైన్స్ ఎగ్జిబిషన్‌తో లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. సాంప్రదాయ ఇంజనీరింగ్‌కు తోడ్పాటును ఇచ్చేందుకు ఈ ఎగ్జిబిషన్ తోడ్పడుతుందని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “దేశ రక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోంది. బీడీఎల్, హెచ్‌ఏఎల్ మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఈ సైన్స్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు దేశరక్షణ పట్ల అవగాహన కలుగుతుంది. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతోంది. సంప్రదాయ ఇంజినీరింగ్ విద్యపై కూడా విద్యార్థులకు అవగాహన పెంచాలి”.. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సైన్స్ టీచర్‌గా పనిచేశా-రాజ్‌నాథ్ సింగ్
ఈ సందర్బంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానని చెప్పారు. సర్ సీవీరామన్.. ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారుని.. నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. తాను కూడా సైన్స్ విద్యార్థినే.. కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానని చెప్పారు. ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు రాజ్‌నాథ్ సింగ్. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని కేంద్ర మంత్రి సూచించారు.