ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థ 20 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించింది. సంస్థ నిబంధనలను ఉల్లంఘించి మీడియాకు డేటా లీక్ చేసిందన్న కారణంతో ఉద్యోగులను తొలగించినట్టు వెల్లడించింది. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న సంస్థ ఇలా ఉద్యోగులను తొలగించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.
“ఉద్దేశం ఏదైనా, అంతర్గత సమాచారాన్ని లీక్ చేయడం మా విధానాలకు విరుద్ధమని మేము ఉద్యోగులు కంపెనీలో చేరినప్పుడు వారికి తెలియజేస్తాము. మేము కాలానుగుణంగా వారికి గుర్తు చేస్తుంటాం” అని మెటా ప్రతినిధి ఒకరు తెలిపారు.
“మేము ఇటీవల ఒక దర్యాప్తు నిర్వహించాము.. దీని ఫలితంగా కంపెనీ అంతర్గత సమాచారాన్ని బయటకు పంచుకున్నందుకు దాదాపు 20 మంది ఉద్యోగులను తొలగించాము. ఇంకా కొంత మంది ఈ జాబితాలో ఉన్నారు”.. అని కంపెనీ ప్రకటించింది.
“మేము దీనిని తీవ్రంగా పరిగణిస్తాము. లీక్‌లను గుర్తించినప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటాము.”
ఉద్యోగులతో జుకర్ బర్గ్ సమావేశం తర్వాత వచ్చిన వరుస నివేదికల ఆధారంగా ఈ తొలగింపులు జరిగనట్టు తెలుస్తోంది. కంపెనీ పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. లీక్‌లు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే ఏ అంశం లీకయిందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.