నయా ద్రావిడవాదంతో విజయ్ సరికొత్త మార్పు తీసుకురానున్నారా?

తమిళ రాజకీయాల్లో అత్యంత అనూహ్యంగా దూసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన దళపతి విజయ్.. తన రాజకీయ పంథాను ఒక సరికొత్త దిశలో నడిపిస్తున్నారు. ద్రావిడ పార్టీల ఆరు దశాబ్దాల ఆధిపత్యానికి తెరదించిన ఆయన.. ఇప్పుడు ఆ ద్రావిడ వాదాన్ని, తమిళ జాతీయవాదాన్ని ఒకే గాడిన కడుతూ ఒక ‘నయా ద్రావిడ’ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌కు నివాళులు అర్పించడం, ఆయనను తరచూ స్మరించుకోవడం ద్వారా తమిళ సెంటిమెంట్ కు ఆయన పెద్దపీట వేస్తున్నారు. ఒకవైపు సామాజిక న్యాయం, మరోవైపు సాంస్కృతిక అస్తిత్వం.. ఈ రెండింటినీ విజయ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ప్రభాకరన్ పేరును తెరపైకి తేవడం వెనుక విజయ్ వేసిన రాజకీయ వ్యూహం ఏమిటి?

తమిళనాడు రాజకీయాల్లో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ పేరును ప్రస్తావించడం అంటేనే ఒక సంచలనం. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ఇప్పుడు అదే సాహసం చేస్తున్నారు. శ్రీలంక తమిళుల పట్ల, ప్రభాకరన్ పట్ల ఆయనకు ఉన్న ఎమోషనల్ అటాచ్ మెంట్ ఈనాటిది కాదు. శ్రీలంక ప్రభుత్వ సైనిక దాడులు తీవ్ర స్థాయిలో ఉన్న 2008లోనే విజయ్ చెన్నైలో నిరాహార దీక్ష చేశారు. స్వతంత్ర ఈలాం సిద్ధిస్తుందని నినదిస్తూ, “మనం పులి బిడ్డలం” అంటూ ప్రాచీన తమిళ గ్రంథం పురనానూరును ఉటంకిస్తూ ఆయన నాడు చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్, ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. “ముల్లివాయ్కాల్ జ్ఞాపకాలను మా హృదయాల్లో భద్రంగా ఉంచుకుంటాం” అంటూ 2009లో జరిగిన మారణహోమాన్ని, ప్రభాకరన్ మరణాన్ని ఆయన తన ఎక్స్ వేదికగా తీవ్ర భావోద్వేగంతో స్మరించుకున్నారు.

విజయ్ రాజకీయ సందేశాలలో ఎల్టీటీఈ, ప్రభాకరన్, తమిళ కాజ్ తరచూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం సభల్లో సైతం ప్రభాకరన్ చిత్రపటాలు ప్రముఖంగా కనిపిస్తుంటాయి. 2025 సెప్టెంబర్ నెలలో నాగపట్నం జిల్లాలో ఆయన చేసిన ప్రసంగం దీనికి ఒక బలమైన ఉదాహరణ. ‘మా పేగు బంధం అయిన తమిళులు, ప్రపంచంలో ఎక్కడున్నా.. తల్లి లాంటి నాయకుడిని కోల్పోయి ఇప్పటికీ బాధపడుతున్నారు. వారి కోసం గొంతెత్తడం మా బాధ్యత’ అంటూ ప్రభాకరన్‌ను ఉద్దేశించి విజయ్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. వాస్తవానికి భారతదేశంలో ఎల్టీటీఈని 2024 మేలో మరో ఐదేళ్ల పాటు బ్యాన్ చేశారు. అయినప్పటికీ, ప్రభాకరన్‌ను ప్రస్తావించడం ద్వారా విజయ్ వేర్పాటువాదానికి మద్దతు ఇస్తున్నట్లు కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల ఆవేదనను, వారి డిగ్నిటీని, సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి ముగింపు పలికి విజయ్ సాధించిన విజయం, తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ సైద్ధాంతిక మార్పును సూచిస్తోంది. తన రాజకీయ ప్రయాణంలో విజయ్ చేస్తున్న అతి పెద్ద బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏంటంటే.. ద్రావిడ వాదాన్ని, తమిళ జాతీయవాదాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం. ఒకప్పుడు ఈ రెండు సిద్ధాంతాల మధ్య తమిళనాడులో తీవ్ర వైరుధ్యం ఉండేది. ద్రావిడ వాదం సామాజిక న్యాయం, కుల వ్యతిరేకత, హేతువాదం చుట్టూ తిరిగితే.. తమిళ జాతీయవాదం కేవలం తమిళ అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక మూలాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు సిద్ధాంతాలూ “ఈ నేలకు ఉన్న రెండు కళ్లు” అని విజయ్ ఒక చారిత్రక ప్రకటన చేశారు. ఈ బ్యాలెన్సింగ్ ద్వారా ఆయన ఒక నియో ద్రావిడ వాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. సంప్రదాయ ద్రావిడ వాదంలోని సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, లౌకికవాదాలను ఒక గవర్నెన్స్ ఆర్కిటెక్చర్‌గా వాడుకుంటూనే.. తమిళ జాతీయవాదాన్ని తన పార్టీ ఎమోషనల్ ఇంజిన్‌గా మార్చుకుంటున్నారు.

విజయ్ వల విసురుతున్న ఈ కొత్త సిద్ధాంతం ప్రధానంగా సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చికి అతిపెద్ద డ్యామేజ్ చేస్తోంది. గత దశాబ్ద కాలంగా తమిళ జాతీయవాదాన్ని అత్యంత అగ్రెసివ్ గా వాడుకుంటూ, ద్రావిడ పార్టీలపై సీమాన్ తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు విజయ్ రాకతో సీమాన్ కు ఉన్న ఆ ఏకచత్రాధిపత్యం బద్దలైంది. టీవీకే ఆవిర్భావం తర్వాత నామ్ తమిళర్ కట్చి నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ వలసలు మొదలయ్యాయి. ఒక స్థిరమైన, జయప్రదమైన ఎన్నికల ప్లాట్ ఫామ్ వైపు ఆ పార్టీ మద్దతుదారులు ఆకర్షితులవుతున్నారు. విజయ్ పార్టీ జెండాలో ఉన్న ఎరుపు, పసుపు రంగులు, యుద్ధ ఏనుగులు, వాగై పువ్వు.. ఇవన్నీ కూడా ఎల్టీటీఈ, తమిళ జాతీయవాద సెంటిమెంట్ ను సూచించే అత్యంత బలమైన సంకేతాలు. వీటికి తోడు కేవలం పెరియార్, అన్నాదురైకే పరిమితం కాకుండా.. అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచియార్, అంజలై అమ్మాళ్ లాంటి జాతీయ, ప్రాంతీయ ఐకాన్స్ ను కలుపుకోవడం ద్వారా ఆయన తన సిద్ధాంతాన్ని మరింత విస్తృతం చేశారు.

కరుడుగట్టిన ద్రావిడ రాజకీయాలు ఎప్పుడూ నాస్తికత్వాన్ని, హిందూ వ్యతిరేకతను గట్టిగా నమ్ముతాయి. ఇది సాధారణ తమిళుల మత విశ్వాసాలతో తరచూ ఘర్షణ పడేది. కానీ విజయ్ ఈ ఘర్షణను అత్యంత తెలివిగా దాటేశారు. దేవుడిని, మతాన్ని నేరుగా వ్యతిరేకించకుండా.. తమిళ సాంస్కృతిక గర్వం అనే ఆయుధాన్ని ఆయన ప్రయోగిస్తున్నారు. దీనివల్ల, అటు బీజేపీ చెప్పే హిందూ జాతీయవాదానికి ఆకర్షితులు కాని వారు, ఇటు కఠినమైన నాస్తిక ద్రావిడ వాదం నచ్చని యువత.. నేరుగా విజయ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈనాటి యువత పాతతరం నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాలకు కనెక్ట్ కావడం కష్టం. అందుకే వారి కోసం ఆధునికమైన, ఆశాజనకమైన తమిళ అస్తిత్వాన్ని ఆయన నిర్మిస్తున్నారు. అదే సమయంలో కరుడుగట్టిన వేర్పాటువాదానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. తమిళ జాతీయవాదాన్ని ఒక ఎమోషనల్ షీల్డ్ గా వాడుకుంటూనే, భారత రాజ్యాంగ పరిధిలో ఉంటూ, సంక్షేమ పాలనను అందించడమే విజయ్ అసలైన మాస్టర్ ప్లాన్. ఈ నియో ద్రావిడ సిద్ధాంతం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలను శాశ్వతంగా మార్చివేస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

ఢిల్లీకి రామచందర్‌రావు… అధిష్టానికి బండి భగీరథ్‌ నివేదిక

తెంలగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు ఢిల్లీకి బయల్దేరారు. హస్తిన పర్యటనలో భాగంగా బీజేపీ అగ్రనేతలను రామచందర్‌రావు కలవనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొడుకు బండి భగీరథ్ ఎపిసోడ్‌పై పూర్తి నివేదిక కోరింది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్