స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డును నమోదు చేసింది. జులై 3న మెట్రో రైలులో 5 లక్షల 10 వేలమంది ప్రయాణించారు. ఒక్కరోజే ఇంత భారీస్థాయిలో ప్రయాణికులు ట్రావెల్ చేయడం సరికొత్త రికార్డ్. నాగోల్ నుండి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుండి కూకట్‌పల్లి రూట్లలో ఎక్కువమంది ప్రయాణించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో రైలు 40 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో గత కొన్ని రోజులుగా ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆఫీసు వేళల్లో మెట్రోలో జనం రద్దీగా ఉంటున్నారు. అమీర్‌పేట జంక్షన్ ఉదయం, సాయంత్రం కిక్కిరిసిపోతోంది.
4లక్షల 90 వేల మంది జర్నీ
అప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో రైలులో 40 కోట్ల మంది ప్రయాణం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ అంతరాయం నుంచి బయటపడేందుకు జనాలంతా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రోలో రోజుకు సగటున 4లక్షల 90 వేల మంది ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 5లక్షలు దాటనున్నట్టు పేర్కొంటున్నారు.
ప్రయాణం సులభతరం
విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఈ భాగ్యనగరంలో జీవనం సాగిస్తుంటారు. కాగా పెరుగుతున్న జనాభాతో రోడ్లపై ప్రయాణాలు చేయడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దానితో ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభతరం చెయ్యడం కోసం మెట్రో రైలు ప్రయాణాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ మెట్రో ప్రయాణంతో చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందిని తొలగిస్తూ ప్రజలకు ప్రయాణాన్ని మరింత చేరువచేస్తోంది.