అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దేశ రాజధాని దిల్లీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. బీజేపీ ఆపరేషన్ లోటస్‌కు కుట్రలు పన్నుతోందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణల చేశారు.. దీనిపై కమలదళం తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు.
బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను వారి వైపు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తోందని, పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేసి 15 కోట్లు ఇస్తామని ఆశ పెట్టినట్లు కేజ్రీవాల్, ఇతర నేతలు ఆరోపించారు. పార్టీ నేతలను భయపెట్టి బీజేపీలో చేర్చుకోవడానికి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తమ నేతలు మోసపోరని అన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అందువల్లే తమ పార్టీ నేతలను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందని సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆప్ ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ ఎల్‌జీ ఆదేశించింది. ఢిల్లీ ఎల్‌జీ ఆదేశాలతో కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ బృందం చేరుకుంది. 16 మంది అభ్యర్థులకు బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ ఆరోపించిన నేపథ్యంలో ఒక్కొక్కరికి 15 కోట్లు ఇవ్వజూపిందన్న కేజ్రీవాల్ కామెంట్స్ బీజేపీ సీరియస్ అయింది. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ సహా ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ బృందాలు వెళ్లారు.