అల్లు అర్జున్ మచ్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2కు గుడ్ న్యూస్ విన్పించింది తెలంగాణ ప్రభుత్వం. టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిసెంబర్ నాలుగున రాత్రి 9 న్నర గంటల నుంచి బెనిఫిట్ షోలతోపాటు అర్థరాత్రి ఒంటిగంట ప్రదర్శనకు అనుమతిచ్చింది. బెనిఫిట్ షోలకు 8 వందల రూపాయలను ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఇవే ధరలు ఉండనున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం.
అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అదనపు షోలకు అనుమతిచ్చింది. డిసెంబర్ ఐదు నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లో 150 రూపాయల ధరను నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌లో 200 రూపాయలుగా నిర్ధారించింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో 105, మల్టీప్లెక్స్‌లో 150 రూపాయలకు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లలో ఉన్న రేట్ల మీద 20 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 50 రూపాయల పెంపునకు అనుమతిచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు.
పుష్ప 2 చిత్రం ఆరు భాషల్లో 12 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. అత్యధిక థియేటర్లలో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల అవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్ యాప్ సాయంతో ఏ భాషలోనైనా ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రన్ టైమ్ విషయానికి వస్తే 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ముస్తాబైంది పుష్ప 2 మూవీ.
విడుదలకు ముందే బుకింగ్స్, సాంగ్స్ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తున్న సినిమాగా నిలిచింది పుష్ప 2 మూవీ. ఇదే సమయంలో పుష్ప2 చిత్రం ద్వారా 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 నటుల జాబితాలో అల్లు అర్జున్ 300 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మేరకు ఫోర్బ్స్ ఇండియా తన కథనంలో పేర్కొంది.