దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు మరోసారి సమ్మె బాట పట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ పార్టనర్లు 5 గంటల పాటు విధులను బహిష్కరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమ్మె కొనసాగనుంది.
గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) పిలుపుతో దేశవ్యాప్తంగా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది ఈ నిరసనలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.3 చొప్పున పెంచడం వల్ల తమపై భారీ ఆర్థిక భారం పడుతోందని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీఐపీఎస్‌డబ్ల్యూయూ ప్రకారం, తాజా ఇంధన ధరల పెంపు ప్రభావం దేశవ్యాప్తంగా సుమారు 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లపై పడనుంది. ఇప్పటికే ఆదాయాలు తగ్గిపోతుండగా, పెరుగుతున్న ఖర్చులతో జీవనం భారంగా మారిందని వారు చెబుతున్నారు. రోజుకు గంటల తరబడి పనిచేసినా సరైన ఆదాయం రావడం లేదని, కంపెనీలు ప్రోత్సాహకాలు తగ్గించడంతో పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపిస్తున్నారు.
ఇదే కాకుండా గిగ్ వర్కర్లకు ఎలాంటి సామాజిక భద్రత లేకపోవడంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా పలు రాష్ట్రాల్లో గిగ్ వర్కర్లు ఆందోళనలు చేపట్టగా, ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్రం ఇప్పటికే ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. అయితే అవి అమలులోకి రావాలని, ప్లాట్‌ఫామ్ కంపెనీలు వర్కర్లకు కనీస రక్షణ కల్పించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సమ్మె ప్రభావంతో దేశంలోని పలు నగరాల్లో క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీ సేవలు తాత్కాలికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.


