పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న భగీరథ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బండి భగీరథ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. అతనితో టచ్‌లో ఉన్నవారిపై, స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం
సమాచారం ప్రకారం, కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఢిల్లీ ప్రాంతాల్లో భగీరథ్ ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
భగీరథ్‌పై మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసు నమోదైన అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇప్పటికే విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఇక కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి పార్టీలు ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, పోలీసులు మాత్రం కేసును సీరియస్‌గా తీసుకుని వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో భగీరథ్ దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్‌పోర్టులు, కీలక చెక్‌పోస్టులకు సమాచారం అందించారు.


