మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్ లొంగుబాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన భగీరథ్, కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఆయన స్పందించకపోవడంతో కరీంనగర్‌లో నివసిస్తున్న భగీరథ్ మేనమామ వంశీకృష్ణకు కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
మరోవైపు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భగీరథ్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగింది. అయితే కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేశారు.
హైకోర్టులో ఊరట లభించకపోవడంతో భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు బండి బగీరథ్ తండ్రిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కుమారుడిని దాచిపెట్టి రాజకీయ డ్రామా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి( Revanth Reddy)కూడా స్పందిస్తూ.. భగీరథ్‌ను వెంటనే పోలీసులకు అప్పగించాలని హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ రంగు దాల్చింది.
ఈ నేపథ్యంలో కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించగా, ఉదయం నుంచే భగీరథ్ లొంగుబాటుపై ప్రచారం సాగుతోంది.
కాసేపట్లో భగీరథ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం వెలువడుతున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.


