భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది( Upendra Dwivedi)ఇస్లామాబాద్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు కొనసాగిస్తే, “భూభాగంలో భాగంగా ఉండాలా? లేక చరిత్రలో కలిసిపోవాలా?” అనేది వారు నిర్ణయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో ‘యూనిఫామ్ అన్‌వీల్డ్’ నిర్వహించిన ‘సేనా సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది, గత ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తరహా పరిస్థితులు మళ్లీ వస్తే భారత సైన్యం ఎలా స్పందిస్తుందనే ప్రశ్నకు ఈ వ్యాఖ్యలు చేశారు.
“నేను ముందే చెప్పాను.. పాకిస్థాన్ భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తూ కొనసాగితే, వారు భూభాగంలో భాగంగా ఉండాలా? లేక చరిత్రలో కలిసిపోవాలా? అనేది నిర్ణయించుకోవాలి” అని ఆయన హెచ్చరించారు.
ఆయన వ్యాఖ్యలు భారత్ ఉగ్రవాదంపై తీసుకుంటున్న కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. ఇటీవల దేశం, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవాన్ని నిర్వహించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గత ఏడాది మే 7న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు కచ్చితమైన దాడులు నిర్వహించాయి.
ఆ తర్వాత పాకిస్థాన్ కూడా భారత్‌పై ప్రతిదాడులకు దిగగా, భారత సైన్యం కూడా అదే ఆపరేషన్ సిందూర్ కింద ఎదురుదాడులు చేపట్టింది. అణ్వస్త్రాలు కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. చివరికి మే 10 సాయంత్రం రెండు దేశాలు పరస్పర అవగాహనకు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.


