తనను తాను యూఎస్ మోడల్‌గా పరిచయం చేసుకున్నాడు. డేటింగ్ యాప్‌లలో యువతులు, మహిళలతో పరిచయాలు పెంచుకొని… ఆ తర్వాత వారినే బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బులు గుంజడం ప్రారంభించాడు. కానీ, చేస్తున్న మోసం ఎక్కువ కాలం సాగదు కదా.. చివరకు ఓ రోజు పోలీసులకు చిక్కాడు. కటకటాలను లెక్కిస్తున్నాడు. ఈ దారుణమైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీకి చెందిన తుషార్ సింగ్ బిష్ట్.. ఉద్యోగ రీత్యా ఓ రిక్రూటర్. BBA పూర్తి చేశాడు. నోయిడాలో ఓవైపు ఉద్యోగం చేస్తున్నా.. డబ్బుపై ఆశతో డేటింగ్ ఫ్లాట్ ఫాంలలో మోడల్‌నంటూ చెప్పుకున్నాడు. డేటింగ్ యాప్‌లలో ఇంటర్నేషనల్ మొబైల్ ఫోన్ నెంబర్లు ఉపయోగించి తాను యూఎస్‌కు చెందిన ఫ్రీలాన్స్ మోడల్‌నని.. ఇండియాలో పర్యటిస్తున్నానని చెబుతూ యువతులు, మహిళలతో పరిచయాలు పెంచుకునే వాడు.
యువతులు, మహిళల నమ్మకాన్ని సంపాదించాక వారి ప్రైవేటు ఫోటోలు, వీడియోలు పంపమని కోరేవాడు. అవతలి వాళ్లు అలాంటి ఫోటోలు, వీడియోలు పంపగానే వాటిని ఎదుటివారికి తెలియకుండా సేవ్ చేసుకొని మెల్లగా డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఎవరైనా కాదు కూడదంటే సంబంధిత ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెబుతూ బెదిరించి డబ్బులు దండుకునేవాడు తుషార్ సింగ్.
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది యువతులు, మహిళల జీవితాలతో ఆటలాడుకున్నాడు తుషార్ సింగ్. ఈ క్రమంలోనే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ పోలీసులు మాటు వేసి నిందితుడ్ని పట్టుకున్నారు. కటకటాల వెనక్కు పంపారు.