ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. ఢిల్లీలో కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీయే అధికారంలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఈసారి ఢిల్లీలో విజయం సాధించాలన్న కృత నిశ్చయంతో భారతీయ జనతా పార్టీ ఉంది. తాజాగా అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. 29 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.
కమలం పార్టీ మాజీ ఎంపీ పర్వేష్ సాహిబ్ వర్మకు అభ్యర్థుల జాబితాలో చోటు లభించింది. న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పర్వేష్ సాహిబ్ వర్మ పోటీ చేస్తారు. న్యూ ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. అలాగే ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు కూడా ఈసారి బీజేపీ జాబితాలో చోటు లభించింది. కైలాష్ గెహ్లాట్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారు. కేజ్రవాల్ క్యాబినెట్‌లో రవాణా శాఖామంత్రిగా కైలాష్ గెహ్లాట్ పనిచేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన ఆప్‌కు గుడ్ బై కొట్టి, బీజేపీలో చేరారు. ప్రస్తుతం బిజ్‌వాసన్ నియోజకవర్గం నుంచి కైలాష్ గెహ్లాట్ పోటీ చేస్తారు.
కాగా బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరీకి కల్కాజీ నియోజకవర్గం టికెట్ లభించింది. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఆతీశీ పోటీ చేస్తున్నారు. కాగా ఇక్కడ్నుంచి కాంగ్రెస్ టికెట్‌పై అల్కా లాంబా పోటీ చేస్తున్నారు. అలాగే ఈస్ట్ ఢిల్లీలోని గాంధీనగర్ నియోజకవర్గం టికెట్ అరవీందర్ సింగ్ లవ్లీ కి లభించింది. అరవీందర్ సింగ్ లవ్లీ గతంలో షీలా దీక్షిత్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అరవీందర్ సింగ్ చాలా కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. కాగా ప్రస్తుతం బీజేపీ టికెట్‌పై గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొంతకాలంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. 2015 నుంచి ఢిల్లీలో వరుసగా మూడు సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతింది. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కదాంట్లోనూ ఆప్ విజయం సాధించలేకపోయింది.కాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కొంతకాలం కిందట మద్యం కుంభకోణంలో చిక్కుకున్నారు. కేజ్రీవాల్‌పై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కావడంతో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే జైలు నుంచి బెయిల్ పై వచ్చిన తరువాత కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కేజ్రీవాల్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న అతీశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే…రానున్న ఢిల్లీ ఎన్నికలకు కేజ్రీవాల్ ఇటీవల కసరత్తు ప్రారంభించారు. సీనియర్ సిటిజన్లకు అలాగే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. సంక్షేమ పథకాలతో ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ టెక్నికల్‌గా ఇప్పటికీ ఇండియా అలయన్స్ కూటమిలోనే ఉంది. అయితే ఇండియా కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీకి విభేదాలు తలెత్తాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరి పోరు చేస్తోంది. కాగా ఢిల్లీ, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. దాదాపు పదిహేను సంవత్సరాల పాటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు బలం పుంజుకోవడంతో కాంగ్రెస్ పరపతి మసకబారింది. ఢిల్లీ రాజకీయాలవరకు హస్తం పార్టీ మూడో స్థానానికి వెళ్లిపోయింది.
మొత్తంమీద తన నిజాయితీయే ఈసారి ఎన్నికలలో ఆప్‌ను గెలిపిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ భరసాతో ఉన్నారు. అయితే ఆప్‌ను ఇరుకున పెట్టడానికి మద్యం కుంభకోణాన్ని ఎన్నికల ప్రచారంలో కీలకాంశం చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు ఇటీవల ఢిల్లీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.