స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో జగన్ పేరును సీబీఐ ప్రస్తావించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ కేసులో జగన్ పాత్ర జగమెరిగిన సత్యం అని తెలిపారు. ఈ కేసును ఎన్ని మలుపులైనా తిప్పుతారంటూ వ్యాఖ్యానించారు. తాడేపల్లి కుట్ర బయటపడుతుందనే భయంతో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐకి సహకరించకుండా పోలీసులను అడ్డుపెట్టుకున్నారని మండిపడ్డారు. డేరా బాబా ఎపిసోడ్ తలపించేలా కర్నూలులో వైసీపీ నేతలు వ్యవహరించారని చంద్రబాబు విమర్శించారు. రాజమహేంద్రవరంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు సీఎం జగన్ పేరును సీబీఐ కౌంటర్‌లో ప్రస్తావించడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కౌంటర్‌లో సీఎం జగన్ పేరును సీబీఐ పేర్కొనడం చిల్లర, పిల్ల చేష్టగా ఆయన అభివర్ణించారు. ఏదో సంచలనం కోసం సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారని అందులో భాగంగానే జగన్ పేరును తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు. అవినాశ్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని బెదిరింపులకు సీబీఐ దిగుతుందని పేర్కొన్నారు. జగన్ పేరు రావడం వెనుక కుట్ర ఉందని, దీని వెనక ఉన్నవారు బయటికి రావాల్సిన అవసరం ఉందని సజ్జల వెల్లడించారు.