స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనల నేపథ్యంలో బీఐ అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించింది.
వివేకా మృతి విషయం జగన్‌కు అదే రోజు ఉదయం 6.15 గంటలకు ముందే తెలిసినట్లు తేలిందని పేర్కొంది. పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే వివేకా చనిపోయారని ఆయనకు తెలిసిందని చెప్పింది. అయితే ఆ విషయం జగన్‌కు అవినాశ్ రెడ్డి ముందే చెప్పారా? అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపింది. అవినాశ్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టంచేసింది. హత్య జరిగిన రోజు రాత్రి 12.27 గంటల నుంచి 1.10 గంటల వరకు అవినాశ్ రెడ్డి వాట్సాప్ కాల్స్ మాట్లాడారని కౌంటర్‌లో సీబీఐ వెల్లడించింది.
మరోవైపు అవినాశ్ రెడ్డి అసలు విచారణకు సహకరించడంలేదని, ఇప్పటికే మూడు సార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లింది. ఈనెల 22న విచారణకు రావాలంటే తల్లి అనారోగ్యం పేరుతో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లారని.. దీంతో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అధికారులు కర్నూలు వెళ్లారంది. అయితే అక్కడి వాతావరణం చూసి శాంతి భద్రతల దృష్ట్యా వెనుదిరగాల్సి వచ్చిందని పేర్కొంది. సుప్రీంకోర్టు జూన్ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకు అవినాశ్ రెడ్డిని విచారించాలని.. అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వవొద్దంటూ కౌంటర్‌లో తెలియజేసింది.