ప్రధాని మోదీని పొగుడుతూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2019 ఎన్నికల సమయంలో ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన అనంతరం తొలిసారి ప్రధానిపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఎప్పుడూ ఎన్డీయే విధానాలను తప్పుబట్టలేదని.. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే ఎన్టీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. ‘టైమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్-ద నీడ్ టు కీప్ ఫైటింగ్’ అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు.
మోదీ అభివృద్ధి విధానాలతో తాను ఏకీభవిస్తున్నట్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోదీ విధానాల వల్లే ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని తెలిపారు. తాను, మోదీ విజన్ ఉన్న నేతలమని పేర్కొన్నారు. టెక్నాలజీతో దేశంలో ఉన్న పేదరికాన్ని దూరం చేయవచ్చన్నారు. ప్రధాని విధానాలను మెరుగ్గా అవలంభిస్తే 2050నాటికి భారత్ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు. అలాగే రూ.2000 నోట్లను రద్దు చేయాలని ప్రతిపాదిస్తున్నా అని చంద్రబాబు వెల్లడించారు.