యూట్యూబర్ హర్షపై కేసులు నమోదు చేశారు పోలీసులు. డబ్బులు రోడ్లపై విసురుతూ వీడియోలు చేస్తున్న హర్షపై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో సనత్‌నగర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
కూకట్ పల్లిలో హర్ష అనే యూట్యూబర్ ఓవరాక్షన్ చేశాడు. నడిరోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో గాల్లోకి డబ్బులు విసిరాడు. కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ బైక్ పై స్టంట్స్ చేశాడు. ఆ కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు తీశారు. దీనిపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. హర్ష తీరుని వారు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు అతడు దిగజారిపోయాడని సీరియస్ అవుతున్నారు.
రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేయడంతో, వాటి కోసం జనాలు పరుగులు పెట్టారని, దీని వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని స్థానికులు యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వ్యూయర్స్ కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు తీస్తున్న హర్షపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, పబ్లిక్ లో న్యూసెన్స్ కు కారణం అవుతున్న ఇలాంటి వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటున్నారు. లేదంటే ఇలాంటి వాళ్లను చూసి మరికొందరు తయారవుతారని అంటున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పనులేవీ చేయొద్దని యూట్యూబర్లను కోరుతున్నారు.