క్యాన్సర్ కు ఆన్సర్ ఇచ్చేయగలదు, భారీకాయులను బక్కపలచన చేసేయగలదు, కొంచెం పుల్లగా ఉన్నా మెల్లగా రోగాలను హరించేయగలదు, విటమిన్ సీ తో ఇమ్యూనిటీని పెంచేయగలదు, చిగుళ్ల వ్యాధికి చెక్ పెట్టగలదు, బాక్టీరియాను మట్టుపెట్ట గలదు, ఫైటో స్టెరాల్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందించేయగలదు, రక్తంలోని సుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయగలదు …ఇన్ని సుగుణాల ఆరోగ్యప్రదాత ఎవరో తెలుసా…సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే లక్ష్మణఫలం. ఆకుపచ్చ పనసకాయ మాదిరి కనిపించే లక్ష్మణఫలంలో గింజలు తక్కువగా ఉంటాయి. గుంజు ఎక్కువగా ఉంటుంది. పుల్లగా రంజుగా ఉండే ఈ గుంజు తీసుకుంటే ఎన్నో రోగాలు ఫలాయన మంత్రం పఠిస్తాయి.
పరోపకారాయ ఫలంతి వృక్షాః.. ఇతరుల ఉపకారం కోసమే చెట్లు ఉద్భవిస్తాయి. ఏ చెట్టయినా పండ్లు ఎవరి కోసం ఇస్తుంది. పరుల కోసమే కదా.! తన ఫలాలు ఇతరులు తృప్తిగా తిని సంతృప్తికరంగా జీవించాలని, ఆరోగ్యకరంగా ఉండాలని వృక్షాలు ఆశీర్వదిస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ మహద్ భాగ్యం కల్గించేవి చెట్లలోని అణువణువు అనే సంగతి తెలిసిందే. రారాజు ఫలాలుగా కొన్ని పండ్లు పేరొందాయి. పేదవాని ఆపిల్ సీతాఫలం స్వీట్, హెల్త్ ఫ్రూట్ గా పేరొందింది. సీతాఫలం అందరికీ తెలిసిందే. రామాఫలం కొందరికి తెలుసు. లక్ష్మణ ఫలం..అనగానే ఇదేమి పండు, ఎక్కడ ఇది లభ్యం, రుచికరమైనదా, ఆరోగ్యవంతమా.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. అయితే, రోగాల్లో అగ్రరోగంగా పేరొందిన క్యాన్సర్ ను కూకటి వేళ్లతో పెకిలించేయగల సత్తా లక్ష్మణఫలానికి ఉంది. ఇదేకాక ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టడంలో లక్ష్మణఫలం చెట్టులోని పువ్వులు, ఆకులు, బెరడు..ఎంతో ఉపయోగపడతాయని ఆయుర్వేద ప్రముఖులు చెబుతున్నారు. లక్ష్మణ్ ఫల్ హెల్త్ ఫుల్ అని స్పష్టం చేస్తున్నారు.
అనోనేసి కుటుంబానికి చెందిన లక్షణ ఫల వృక్షం శాస్త్రీయ నామం ఆనోనా మ్యూరికాటా. గుండె మనిషికి ఎంత ముఖ్యమో… మంచి ఆరోగ్యానికి లక్ష్మణఫలం అంత ముఖ్యమని చాలామంది పెద్దలు చెబుతారు. క్యాన్సర్ అనగానే ఆన్సర్ లేని ప్రశ్న అనేస్తారు ఎవరైనా. ఎందుకంటే క్యాన్సర్ శరీరంలోకి ఎంటరైందంటే..ఆ జీవి సాలెగూటిలోని పురుగు మాదిరి కావల్సిందే. అయితే, క్యాన్సర్ ను ఖబడ్దార్ అని నిలదీయగల్గిన శక్తి లక్ష్మణ ఫలాలకు, పత్రాలకు ఉందని వైద్యశిఖామణులు వెల్లడిస్తున్నారు.
లక్ష్మణఫలం క్యాన్సర్ కు దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు విస్పష్టంగా చెబుతుండగా, కొన్ని శాస్త్ర పరిశోధనల్లోను ఈ విషయం వెల్లడైనట్టు తెలుస్తోంది. ఇక ఈ చెట్టు ఆకులు అయితే క్యాన్సర్ తో పోరాటం చేయడంలో మరీ ముందు ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. క్యాన్సర్ నివారణలో కీమో థెరఫీ ని మించి మేలు చేసే లక్ష్మణ ఫలాల చెట్లు ఎక్కడ ఉంటే ఆరోగ్యకరపరిస్థితులు నెలకొంటాయని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు. లక్ష్మణ ఫలానికి దాదాపు పన్నెండు రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే శక్తి ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. ఎన్నో రకాల ప్రాణాంతక క్యాన్సర్లకు లక్ష్మణ ఫలం, ఈ చెట్టు పత్రాలు మంచి ఔషధమని సంప్రదాయబద్ధ వైద్యశిఖామణులు చెబుతున్నారు. పెద్ద పేగు కేన్సర్ ట్రీట్ మెంట్ లో వినియోగించే కీమో ధెరఫీ కన్నా వేలాది రెట్లు ప్రయోజనం ఈ పండ్లు ఆరగించడం వల్ల ఉంటుందని అంటున్నారు.
లక్ష్మణఫలంలో ఫైబర్ కంటెంట్ అధికం, అయితే, ఎక్కడ బడితే అక్కడ ఇవి పండవు. రసాయనాలు, ఇంజక్షన్లు, కల్తీ గొడవ వీటిలో ఉండదు. ఈ చెట్ల కాయలే లక్ష్మణ ఫలాలుగా మారతాయి. లక్ష్మణ ఫలాల గుజ్జు ఐస్ క్రీములు, పానీయాల్లో సైతం వినియోగిస్తారు. ఔషధగుణాల నిధిగా పేరొందిన లక్ష్మణ ఫలాల చెట్టులో పుష్పలు, పత్రాలు, ఫలాలు…ఇలా ఆరోగ్యాన్ని అందించేవే అన్ని, ఆయుర్వేద మందుల తయారీలోనూ వీటిని వినియోగిస్తారని ఈ రంగానికి చెందిన వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి, తల్లి పాలు పెరగడానికి, కండరాల సమస్యలకు చెట్టు బెరడు, ఆకులు బాగా ఉపయోగపడతాయని చెప్పారు.
కొందరు అడవి బిడ్డలు లక్ష్మణ ఫల వృక్షంలోని సమస్త భాగాలను వివిధ వ్యాధుల చికిత్సకు వాడతారని తెలుస్తోంది. చర్మవ్యాధులు పోగొట్టడంలో లక్ష్మణ పత్రాల పాత్ర అంతా ఇంతా కాదని ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తున్నారు. లక్ష్మణ పత్రాలను ముక్కలుగా చేసి వేడినీటిలో మరిగించి రోజుకు మూడుసార్లు తాగితే పలు వ్యాధులు నయం అవుతాయని, ముఖ్యంగా క్యాన్సర్ కు చెక్ పెట్ట వచ్చని ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తున్నారు.