గత పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ” పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నాం.
పదేళ్లు సీఎంగా ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీతో గొడవ ఉండేది కాదు. వైఎస్‌ఆర్, జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరుమెదపలేదు. నా మీద పగతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పక్కన పడేశారు. ముచ్చుమర్రి కడుతుంటే కేసీఆర్ కళ్లు మూసుకున్నారు. పాలమూరు పథకానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు డిజైన్ మార్చి పాలమూరును ఎడారి చేశారు.
నేను అధికారంలోకి వచ్చిన తర్వాత..మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు మొదలుపెట్టా. పాలమూరును పచ్చగా చేస్తామంటే..కేసీఆర్ ఓర్వలేకపోతున్నారు. వైఎస్ చెప్పులు మోసి పోతిరెడ్డిపాడు ద్వారా..రాయలసీమకు నీళ్లు వెళ్లేలా చేసింది కేసీఆరే. ఆర్డీఎస్ ద్వారా అదనపు జలాలు తరలించినప్పుడు..హరీశ్‌రావు వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.
మా ప్రభుత్వ పాలన బాగాలేదని విపక్షాలు అంటున్నాయి. గత పదేళ్ల పాలనపై చర్చకు కిషన్‌రెడ్డి వస్తారా?.. కేసీఆర్ కూడా చర్చకు రావాలి. ప్లేస్, డేట్ చెప్పండి చర్చకు నేను సిద్ధం.మేం ఏం చేసినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు వద్దంటున్నారు. పాలమూరు ఎండాలి.. మన జీవితాలు బాగుపడొద్దన్నదే వారి ఆలోచన
1931లో బ్రిటీష్ వాళ్లు కులగణన చేశారు. దశాబ్దాల తర్వాత మేం కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా ముందుకెళ్తున్నాం.ఈ పనులన్నీ కేసీఆర్‌కు కనిపించడం లేదు. వీటిపై మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చర్చకు వస్తారా..? రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు తప్ప తెలంగాణలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కూడా లేరు
కేసీఆర్ నువ్వు గట్టిగా కొట్టాలంటే నీ కొడుకును, నీ బిడ్డను, నీ అల్లుడిని కొట్టుకో. కాంగ్రెస్ ను కొడతామంటే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు.
ఏడాదిలోనే రూ.21వేల కోట్లతో రుణమాఫీ చేశాం. తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు ఇచ్చాం. పదేళ్లలో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారు?. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊరిలోనే మేం పోటీ చేస్తాం”.. అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.