ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలో ముఖాముఖి నిర్వహించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం. నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుతామని చెప్పారు.
ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది ఉన్నారని సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. 1000 మెగావాట్ల సోలార్ పవర్‌ను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని తెలిపారు. శిల్పారామం పక్కనే పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శించారు.
త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు ఇస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. సొంత ఆడబిడ్డలకు ఇచ్చినట్లు నాణ్యమైన చీరలను అందిస్తామన్నారు. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశామని చెప్పారు. రూరల్, అర్బన్ అనే తేడా లేదన్నారు. తెలంగాణలో మహిళలంతా ఒక్కటేనన్నారు.
మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాలు, పల్లెల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందన్నారు సీఎం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 8 వైద్య కళాశాలలు రద్దుకాకుండా కృషి చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రాష్ట్ర, కేంద్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు..మిగతా టైంలో అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక్కటైన మహిళా సమాఖ్యకు పెట్రోల్ బంక్ ఇస్తామన్నారు. కోటి మంది మహిళలతో ఓఆర్ఆర్ దగ్గర భారీ ప్రదర్శన చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.
ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని రేవంత్ సూచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చుచేస్తానన్నారు సీఎం. అప్పకపల్లిలో మెడికల్ కాలేజీ, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 70 ఏండ్ల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తికి సీఎం అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. జిల్లా అభివృద్ది కోసం చేయాల్సినవన్నీ చేస్తానన్నారు. జిల్లా అభివృద్ది కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు.