మహా శివరాత్రి కోసం వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోటీ 75 లక్షలతో భక్తులకు సౌకర్యాలు, వివిధ పనులు చేపట్టారు. ఆలయానికి రంగులు వేశారు. విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నారు. చలువ పందిళ్లు, జాతర గ్రౌండ్లో భక్తులకు శివార్చన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటేషన్ ఇతర ప్రత్యేక సిబ్బందిని నియమించి పనులు చేయిస్తున్నారు.
జాతరకు వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఈఓ వినోద్‌రెడ్డి గతంలో సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయం ఈఓ వినోద్‌రెడ్డి తెలిపారు. జాతరకు సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.